

నేటి భారత్ న్యూస్- జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్ లో ‘అదుర్స్’ సినిమా ఒకటి. ఈ సినిమాలో తారక్ కామెడీని కూడా పండించారు. బ్రహ్మానందంతో కలిసి తారక్ చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా సీక్వెల్ ‘అదుర్స్-2’ సినిమా కోసం వస్తే బాగుంటుందని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. తాజాగా ఈ అంశంపై తారక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ సెలెబ్రేషన్స్ కు ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో తారక్ మాట్లాడుతూ… ఏ ఆర్టిస్టుకైనా కామెడీ పండించడం చాలా కష్టమని చెప్పారు. అందుకే ‘అదుర్స్-2’ చేయడానికి భయపడుతున్నానని తెలిపారు. నవ్వించడం గొప్ప వరమని చెప్పారు. ‘దేవర-2’ సినిమా గురించి మాట్లాడుతూ… ఈ సినిమా ఉండదని చాలా మంది అనుకుంటున్నారని… కానీ ‘దేవర-2’ కచ్చితంగా ఉంటుందని చెప్పారు. ‘దేవర’ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆదరించారని అన్నారు. ఇది అభిమానులు భుజం మీద మోసిన సినిమా అని చెప్పారు.