నేటి భారత్ న్యూస్- ఉక్రెయిన్ దళాలు కనుక ఆయుధాలు వదిలేసి లొంగిపోతే ప్రాణాలతో బతికిపోతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తేల్చి చెప్పారు. వేలాదిమంది ఉక్రెయిన్ సైనికులను రష్యన్ దళాలు చుట్టుముట్టిన ప్రస్తుత తరుణంలో ఉక్రెయిన్ దళాలను వదిలేయాలన్న ట్రంప్ అభ్యర్థనకు పుతిన్ ఇలా సమాధానమిచ్చారు. ‘‘వారు కనుక లొంగిపోతే, వారి ప్రాణాలకు మాది గ్యారెంటీ’’ అన్నట్టు పుతిన్‌ను ఉటంకిస్తూ న్యూస్ ఏజెన్సీ ‘రాయిటర్స్’ పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగియడానికి ‘చాలా మంచి అవకాశం’ ఉందని, పుతిన్‌తో గురువారం ఫలవంతమైన చర్చలు జరిగాయని ట్రంప్ నిన్న తెలిపారు. ‘‘రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో నిన్న ఫలవంతమైన చర్చలు జరిగాయి. ఈ భయంకరమైన, రక్తపాతంతో కూడిన యుద్ధం చివరకు ముగిసిపోయేందుకు చాలా మంచి అవకాశం ఉంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు. పూర్తిగా చుట్టుముట్టబడిన ఉక్రెయిన్ దళాల ప్రాణాలు కాపాడాలని పుతిన్‌ను అభ్యర్థించినట్టు చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందానికి రావడం ద్వారా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ఈ యుద్ధానికి ముగింపు పలకాలని మాస్కో, కీవ్‌ను కోరుతున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ఇప్పటికే ఇరువైపులా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు.