నేటి భారత్ న్యూస్- ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు అవసరం లేదని సునీల్ గవాస్కర్ సూచించారు. దుబాయ్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో గవాస్కర్ మాట్లాడుతూ, గత రెండు మ్యాచ్‌లలో నలుగురు స్పిన్నర్లతో ఆడారని, ఇప్పుడు కూడా అదే విధంగా జట్టు కూర్పు ఉండాలని చెప్పారు. కొన్ని అంశాలలో భారత జట్టు మెరుగైతే పైనల్లో తిరుగుండదని ఆయన పేర్కొన్నారు.ఓపెనర్ల నుండి ఇప్పటి వరకు భారీ ఆరంభం దక్కలేదని, ఫైనల్లో వారి నుండి మంచి ప్రదర్శన ఉంటుందని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కొత్త బంతితో ఆరంభంలో కొన్ని వికెట్లు తీయాలని, కనీసం రెండు నుండి మూడు వికెట్లు తీస్తే ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. మిడిల్ ఓవర్లలో పరుగులను నియంత్రిస్తున్నప్పటికీ, వికెట్లు తీస్తేనే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెరుగుతుందని వ్యాఖ్యానించారు.చక్రవర్తి, కుల్దీప్లను జట్టులోకి తీసుకోవడం మంచి నిర్ణయమని సునీల్ గవాస్కర్ అన్నారు. పరిమిత ఓవర్లలో డాట్ బాల్స్‌ను వేయడం కీలకమని, ఈ విషయంలో వారిద్దరు మంచి ప్రదర్శన చేస్తున్నారని ప్రశంసించారు. దుబాయ్ పిచ్ నుండి మంచి సహకారం అందుతోందని వ్యాఖ్యానించారు.