

నేటి భారత్ న్యూస్-ఏడు సెకన్లలో గుండె జబ్బులు నిర్ధారించేందుకు ఏఐ సాయంతో స్కిరాడియావీ యాప్‌ను అభివృద్ధి చేసిన 14 ఏళ్ల ఎన్నారై విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల అనే బాలుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలిశాడు. సిద్ధార్థ్ రూపొందించిన యాప్ సాయంతో గుంటూరు జీజీహెచ్‌లోని రోగులకు పరీక్షలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు సిద్ధార్థ్‌ను ఆహ్వానించారు. అరగంటపాటు బాలుడితో ముచ్చటించిన చంద్రబాబు అతడి ఆవిష్కరణను మెచ్చుకొని అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా సేవలు అందించేలా ఆవిష్కరణలు చేయాలని, తెలుగుజాతి ఎక్కడున్నా అద్భుతాలు సృష్టించాలని తాను కలలు కంటుంటానని, సిద్ధార్థ్ లాంటి విద్యార్థులు సాధించిన విజయాలు తనకు ఎంతో సంతృప్తిని ఇస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఏఐలో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని సూచించారు. అందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని తెలిపారు. సిద్ధార్థ్‌ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అభినందించారు. సీఎంను కలిసిన వారిలో సిద్దార్థ్ తండ్రి మహేశ్, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. కాగా, అనంతపురానికి చెందిన సిద్ధార్థ్ కుటుంబం 2010లో అమెరికా వెళ్లి స్థిరపడింది.