

నేటి భారత్ న్యూస్- ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను ఐపీఎల్ నుంచి రెండేళ్లు బహిష్కరించడాన్ని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ సమర్థించాడు. గతేడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ కేపిటల్స్ జట్టు బ్రూక్‌ను రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. వేలంలో అమ్ముడుపోయిన ఆటగాడు ఆ తర్వాత వైదొలగాలనుకుంటే రెండేళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో బీసీసీఐ వైఖరిని తాను పూర్తిగా అర్థం చేసుకున్నానని, ఇది భవిష్యత్తుకు ఒక ఉదాహరణగా నిలుస్తుందని క్లార్క్ పేర్కొన్నాడు. అనుకున్న ధర దక్కలేదని టోర్నీ నుంచి ఆటగాళ్లు వైదొలగడం సరికాదని అన్నాడు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వైదొలగేలా దీనిని కట్టడి చేయాలని సూచించాడు. ‘హ్యారీ బ్రూక్‌ను ఎందుకోసం కొనుగోలు చేశారు? అతడు ఈసీబీ(ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు) పూర్తి కాంట్రాక్ట్‌ను కలిగి ఉన్నాడు. ఇప్పుడేమో ఐపీఎల్‌లో నిషేధానికి గురయ్యాడు. ఏం జరిగిందో అది మంచికే. వేలంలో ఎంతోమంది ఆటగాళ్లు పాల్గొంటారు. వేలంలో అందరికీ అనుకున్నంత ధర పలకదు. ఐపీఎల్ ఏం చెబుతోందంటే.. వేలంలో అమ్ముడుపోయాక బయటకు వచ్చేస్తే ఆటోమెటిక్‌గా రెండేళ్ల నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని క్లార్క్ వివరించాడు. ‘‘ఇలా నిషేధానికి గురైన మొదటి ఆటగాడు బ్రూకే అని అనిపిస్తోంది. కానీ ఐపీఎల్ అలా ఎందుకు చేస్తుందో నాకు అర్థమైంది. ప్రతి ఆటగాడికీ ఎక్కువ డబ్బులు కావాలి. అయితే, వేలంలోకి వెళ్లి అమ్ముడుపోయిన తర్వాత దానిని మీరు గౌరవించాలి. అనుకున్న మొత్తం రాలేదని వైదొలగలేరని అర్థం చేసుకోవాలి’’ అని క్లార్క్ పేర్కొన్నాడు. క్లార్క్ అద్భుతమైన ఆటగాడని కొనియాడిన క్లార్క్.. భవిష్యత్తులో అతడు ఐపీఎల్‌లో తప్పకుండా భాగమవుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. సరైన కారణం లేకుండా ఏ ఆటగాడు కూడా ఐపీఎల్ నుంచి తప్పుకోలేడని అన్నాడు. కాగా, ఐపీఎల్ నుంచి వైదొలగడంపై బ్రూక్ మాట్లాడుతూ.. ఇది మొదటి ఏడాదా? రెండోదా అని తనకు గుర్తు లేదని, తన కుటుంబంలో ఒకరు మరణించడం వల్లే ఐపీఎల్ నుంచి వైదొలగాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. వ్యక్తిగత కారణాలతోనే ఐపీఎల్ నుంచి వైదొలిగానని, ఐపీఎల్ దీనిని అర్థం చేసుకుంటుందని భావిస్తున్నానని వివరించాడు.