

నేటి భారత్ న్యూస్- చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపీఎల్ లో రికార్డు సృష్టించాడు. ఆ జట్టు మాజీ ఆటగాడు సురేశ్ రైనాను అధిగమించి సీఎస్‌కే తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. నిన్నటి ఆర్‌సీబీతో మ్యాచ్ ఆఖర్లో ధోనీ మెరుపులు మెరిపించిన విషయం తెలిసిందే. మొత్తంగా 16 బంతుల్లో అజేయంగా 30 పరుగులు చేశాడు. తద్వారా సీఎస్‌కే తరఫున అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. ఇప్పటివరకు ఎంఎస్‌డీ చెన్నై తరఫున 236 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించి 4,699 పరుగులు చేశాడు. దీంతో సురేశ్ రైనా (176 మ్యాచుల్లో 4,687) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో ఫాఫ్ డుప్లెసిస్ (2,721), రుతురాజ్ గైక్వాడ్ (2,433), అంబటి రాయుడు (1,932) ఉన్నారు. సీఎస్‌కేపై కోహ్లీ రికార్డు ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కేపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 33 ఇన్నింగ్స్‌లలో 1,084 రన్స్ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు శిఖర్ ధావన్ (1,057) పేరిట ఉండేది. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (896), దినేశ్ కార్తీక్ (727), డేవిడ్ వార్నర్ (696) ఉన్నారు. ఇక నిన్న సీఎస్‌కేతో మ్యాచ్‌లో కోహ్లీ 30 బంతుల్లో 31 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కాగా, నిన్న చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) చేతిలో సీఎస్‌కే 50 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 196/7 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత చెన్నై 197 పరుగుల లక్ష్య ఛేదనకు దిగి 146/8 మాత్రమే చేయగలిగింది.