

నేటి భారత్ న్యూస్- ఒవైసీ వంటి వారు వంద మంది వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆపలేరని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఒవైసీ తాత వచ్చినా ఈ బిల్లు ఆగదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని ముస్లిం సమాజం, మేధావులు వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు తెలుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఒక్క ఒవైసీ వస్తే బిల్లు ఆగుతుందా అని ఆయన ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తీసుకువస్తామని చెప్పినప్పుడు తనకు కరీంనగర్‌లోని పేదవాడు గుర్తుకు వచ్చాడని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లా కోర్టు కాంప్లెక్సులోని న్యాయవాదుల డిజిటల్ లైబ్రరీ కోసం కేంద్ర సహాయ మంత్రి రూ. 15 లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఆయనను సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ, వక్ఫ్ బోర్డు బిల్లుపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అతి త్వరలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ బిల్లును మతపరమైన కోణంలో చూడటం సరికాదని బండి సంజయ్ అన్నారు. దేశం కోసం, ప్రజల కోసం మోదీ ప్రభుత్వం మరిన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడబోదని స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు పేరుతో పేదలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తనకు తెలుసని అన్నారు. కరీంనగర్‌లో ఒక పేద వ్యక్తి ఇల్లు నిర్మించుకుంటే, అది వక్ఫ్ బోర్డు స్థలమని చెప్పి అధికారులు అనుమతులు రద్దు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి తాత ముత్తాతలు కూడా అదే ఇంట్లో నివసించారని తెలిపారు. ఈ బిల్లుకు మతం రంగు పులిమి కొందరు కుహనా లౌకికవాదులు, ఒవైసీ అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం తాను ఎన్నో పోరాటాలు చేశానని, ఆ సందర్భాలలో తాను జైలుకు వెళితే న్యాయవాదులు తనను బయటకు తీసుకువచ్చారని బండి సంజయ్ అన్నారు. కోర్టు ముందు చెట్లు తొలగించినందుకు, పాకిస్థాన్-భారత్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ జెండాలు పట్టుకున్న వారిపై పోరాడిన సమయంలోనూ తాను జైలుకు వెళ్ళానని ఆయన గుర్తు చేశారు.