

నేటి భారత్ న్యూస్- గతేడాది విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య అంతకు క్రితం సంవత్సరంతో పోలిస్తే దాదాపు 15 శాతం తగ్గిపోయినట్టు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ నిన్న పార్లమెంటుకు తెలిపింది. గతంలో కెనడాకు క్యూకట్టిన విద్యార్థులు ఈసారి అటువైపు చూసేందుకు ఇష్టపడటం లేదు. ఫలితంగా కెనడాను ఎంచుకునే విద్యార్థుల సంఖ్య 41 శాతం తగ్గింది. అలాగే, అదే సమయంలో రష్యాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023తో పోలిస్తే గతేడాది రష్యా వెళ్లిన విద్యార్థుల సంఖ్య 33.7 శాతం పెరిగింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) సభ్యుడు ఈ.టీ. మొహమ్మద్ బషీర్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుకాంత మజుందార్ ఈ వివరాలు వెల్లడించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. 2022లో 7,50,365 మంది విద్యార్థులు విదేశాల్లో చదువుతుండగా, 2023లో ఈ సంఖ్య మరింత పెరిగి 8,92,989 మందికి చేరింది. అయితే, గతేడాదికి వచ్చే సరికి ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది. 15 శాతం తగ్గి 7,59,064 మందికి పడిపోయింది. ఇక, ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2023లో 2,33,532 మంది విద్యార్థులు కెనడా వెళ్లగా, గతేడాది 41 శాతం తగ్గి 1,37,608కి పడిపోయింది. కెనడా గతేడాది స్టూడెంట్ వీసా నిబంధనను కఠినతరం చేయడమే ఇందుకు కారణం. అప్లికేషన్లను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుండటంతో వీసా తిరస్కరణ రేటు భారీగా పెరిగింది. కెనడాతోపాటు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్టు కేంద్ర విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య 2023తో పోలిస్తే 2024లో 12.9 శాతం తగ్గింది. అంటే అంతకుముందు ఏడాదిలో 2,34,473 మంది అమెరికాలో చదువుకుంటే 2024లో ఈ సంఖ్య 2,04,058కి పడిపోయింది. అలాగే, యూకేకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 27.7 శాతం, ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థుల సంఖ్య 12 శాతం తగ్గింది. ఇక చైనాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య కూడా భారీగా తగ్గింది. 2023లో 7,279 మంది చైనా వెళ్లగా, గతేడాది 4,978 మంది చైనా వెళ్లారు. అదే సమయంలో రష్యా, ఫ్రాన్స్, జర్మనీలను ఎంచుకునే భారత విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2022లో 19,784 మంది విద్యార్థులు రష్యా వెళ్లగా, 2023లో ఇది 23,503కి పెరిగింది. గతేడాది మరింత పెరిగి 31,444కి చేరుకుంది. 2022లో ఫ్రాన్స్‌కు 6,406 మంది విద్యార్థులు వెళ్లగా, 2023లో ఆ సంఖ్య 7,484కు పెరిగింది. 2024లో ఈ సంఖ్య మరింత పెరిగి 8,536కు చేరుకుంది. అదే సమయంలో జర్మనీ వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2022లో 20,684 మంది, 2023లో 23,296 మంది విద్యార్థులు జర్మనీ వెళ్లగా, 2024లో ఏకంగా 34,702 మంది విద్యార్థులు జర్మనీ వెళ్లారు. న్యూజిలాండ్‌ను ఎంచుకునే భారత విద్యార్థుల సంఖ్య కూడా బాగానే పెరిగింది. 2022లో 1,605 మంది కివీ దేశంకు పయనమవగా 2024లో ఈ సంఖ్య 7,297కు పెరిగింది. ఫిలిప్పీన్స్‌ను ఎంచుకునే విద్యార్థుల సంఖ్య మాత్రం కొంత తగ్గింది. 2022లో 11,261 మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఫిలిప్పీన్స్ వెళ్లగా, 2024లో ఈ సంఖ్య 8,101కి పడిపోయింది.