

నేటి భారత్ న్యూస్- వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త టెక్నాలజీతో రియల్‌మీ కంపెనీ రూపొందించిన రియల్‌మీ P3 Ultra 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి విడుదలైంది. ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లు, సరసమైన ధరతో ఈ ఫోన్ మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా గేమింగ్ ప్రియులు, అత్యాధునిక కెమెరా ఫీచర్లు కోరుకునేవారికి ఈ ఫోన్ ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. రియల్‌మీ P3 5G మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇవాళ జరిగిన ప్రీ సేల్‌లో కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ ఆఫర్ కింద బేస్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, బ్యాంక్ ఆఫర్లతో అదనంగా రూ.2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్ స్పేస్ సిల్వర్, కామెట్ గ్రే, నెబ్యులా పింక్ రంగుల్లో లభిస్తుంది. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999, 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999, మరియు 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా నిర్ణయించబడింది. రియల్‌మీ P3 5G స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన Snapdragon 6 Gen 4 5G చిప్‌సెట్‌ను అమర్చారు. 4nm ఆర్కిటెక్చర్‌తో రూపొందించిన ఈ ప్రాసెసర్ వేగవంతమైన పనితీరును అందిస్తుంది. 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ ఫోన్ సొంతం. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 6,000mAh బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. IP69 రేటింగ్, BGMI 90fps సపోర్ట్‌తో గేమింగ్ అనుభవం మరింత అద్భుతంగా ఉంటుందని రియల్‌మీ సంస్థ తెలిపింది.