

నేటి భారత్ న్యూస్- ఏపీలో మార్చి చివరి నాటికే పగటి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సగటున 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఏపీలో సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఏపీలోని 150కి పైగా మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయని ఐఎండీ తెలిపింది. హీట్ వేవ్స్ కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని వివరించింది. కొమరోలు, నంద్యాల, కమలాపురంలో అత్యధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిపింది. ఎస్.కోట, అనకాపల్లి, అన్నమయ్య జిల్లా రుద్రవరంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టువెల్ల డించింది. కోస్గి, మిళియాపుట్టు, తాడిమర్రి, సబ్బవరం, వీరఘట్టంలో 41 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది. గుంతకల్లు, గోపాలపురం, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, మచిలీపట్నం, నరసరావుపేట, ఏలూరులో 40 డిగ్రీల వేడిమి నమోదైనట్టు ఐఎండీ వివరించింది.