నేటి భారత్ న్యూస్-మెగాస్టార్ చిరంజీవితో సినిమాపై దర్శకుడు అనిల్ రావిపూడి అప్డేట్ ఇచ్చారు. ఫైనల్ స్క్రిప్ట్ పూర్తయిందని ట్వీట్ చేశారు. "చిరంజీవి గారికి నా కథలో పాత్ర 'శంకర్ వరప్రసాద్'ని పరిచయం చేశాను. ఆయనకు కథ బాగా నచ్చింది. ఇంకెందుకు లేటు, త్వరలో ముహూర్తంతో చిరునవ్వుల పండగబొమ్మకి శ్రీకారం" అని తన ట్వీట్లో అనిల్ రావిపూడి రాసుకొచ్చారు. కాగా, ఉగాదికి ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలు జరుపుకోనుందని సమాచారం. ఆ తర్వాత జూన్‌లో రెగ్యులర్ షూట్‌కు వెళ్తుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ మూవీ ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇక చిరు కూడా యువ దర్శకుడు వశిష్ఠ డైరెక్షన్లో చేస్తున్న విశ్వంభర మూవీ షూటింగ్ పూర్తి చేశారు. సో.. తన తర్వాతి ప్రాజెక్టుగా అనిల్ రావిపూడి చిత్రం షూటింగ్లో జాయిన్ అవుతారని సమాచారం. అలాగే శ్రీకాంత్ ఓదెలతో కూడా ఒక మూవీ చేయనున్నారు. కాగా, అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి విక్టరీ వెంకటేశ్‌తో 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఏకంగా రూ. 300కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టడం విశేషం. దీంతో చిరు, అనిల్ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.