

నేటి భారత్ న్యూస్- చెన్నైలో జరిగిన మాఫియా ముఠా సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అనుకొనే హాజరయ్యాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేననే విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ సమావేశంలో పాల్గొన్న పార్టీలన్నీ అవినీతికి పాల్పడ్డవేనని, పలు కుంభకోణాల్లో ఇరుక్కుపోయాయని అన్నారు. పలు కేసులకు సంబంధించి కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదని, కనీసం వారిని ముట్టుకునే ప్రయత్నం కూడా చేయడం లేదని ఆయన అన్నారు. డీఎంకే నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ వెళ్లాయని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయని మండిపడ్డారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇప్పటి వరకు ప్రక్రియ ప్రారంభం కాలేదని, నియమ నిబంధనలు రూపొందించలేదని ఆయన తెలిపారు. ఆరు గ్యారెంటీల హామీల నుండి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రజల దృష్టిని మరల్చేందుకు నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ కేసుల నుండి తప్పించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు చేస్తోందని అన్నారు. డీఎంకే రూ. 1,000 కోట్ల మద్యం కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. అవినీతిమయ డీఎంకేకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేందుకు తమిళనాడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకు స్టాలిన్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ సమావేశానికి హాజరైన పార్టీలన్నీ బీజేపీని బద్నాం చేయాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు.