నేటి భారత్ న్యూస్- దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో ఓ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమితో ఆతిథ్య జట్టు సెమీస్ చేరకుండానే నాకౌట్ దశ నుంచే నిష్క్రమించింది. నిన్నటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ గెలిచి ఉంటే... పాక్‌కు సెమీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండేవి. కానీ, బంగ్లాను కివీస్ ఓడించింది. దీంతో గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీస్‌కు దూసుకెళ్లాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఇంటిముఖం పట్టాయి. ఇక పాక్ సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించడం పట్ల పాకిస్థానీ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెత్త ఆటతో టోర్నీలో కొనసాగలేరంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో పాక్ పలు చెత్త రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఆతిథ్య జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశ నుంచే వైదొలగడం గత 16 ఏళ్లలో ఇదే తొలిసారి. 2009 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ దక్షిణాఫ్రికాకు ఇలాగే జరిగింది. టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన సఫారీలు.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడి, ఒక దాంట్లో గెలిచారు. దాంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. 2017లో భారత్‌ను ఓడించి పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. దీంతో ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది. కానీ, నాకౌట్ దశను దాటలేకపోయింది. తద్వారా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి సెమీస్ చేరకుండానే లీగ్ దశలోనే నిష్క్రమించిన జట్టుగా పాక్ మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంతకుముందు 2002లో ఛాంపియన్స్ ట్రోఫీ సంయుక్తంగా విజేతలుగా నిలిచిన భారత్, శ్రీలంకలకు కూడా 2004లో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అటు ఆస్ట్రేలియా కూడా 2009లో ఛాంపియన్‌గా నిలిచి... 2013లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది. కానీ, ఆసీస్ లీగ్ దశలో ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవకుండానే ఇంటిముఖం పట్టింది.