

నేటి భారత్ న్యూస్ – వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటన సందర్భంగా అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించిందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లేఖ రాశారు. జగన్ కు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లేఖలో ఆయన కోరారు. ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్ కు భద్రత కల్పించడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని లేఖలో మిథున్ రెడ్డి ఆరోపించారు. మిర్చి యార్డు పర్యటనకు వెళ్లిన జగన్ కు పోలీసులు సరైన భద్రత కల్పించలేదని విమర్శించారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరీలో ఉన్న జగన్ కు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల జగన్ నివాసం వద్ద కూడా కొన్ని ఘటనలు జరిగాయని మిథున్ రెడ్డి తెలిపారు. కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని… జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా భద్రతా వైఫల్యం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రమాదకర ధోరణికి తెరలేపుతోందని అన్నారు. మిథున్ రెడ్డి లేఖపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.మరోవైపు, ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ ను వైసీపీ నేతలు కలిశారు. గుంటూరు పర్యటనలో జగన్ కు తగిన రక్షణ కల్పించలేదని ఆయనకు ఫిర్యాదు చేశారు.