

నేటి భారత్ న్యూస్- ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత ఉండేలా చర్యలు చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో వెల్లడించారు. టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, బదిలీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి తెలిపారు. విద్యావ్యవస్థలో టీచర్లది ప్రధాన పాత్ర అని ప్రశంసలు కురిపించారు. వారిపై భారం మోపితే విద్యార్థులకు సరిగా పాఠాలు చెప్పలేరని అన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై మంత్రి లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఐబీ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని ప్రగల్బాలు పలికిందని గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. స్కూళ్ల ఏర్పాటుకు సంబంధించి నివేదిక కోసమే రూ.5 కోట్లు ఖర్చుచేసిందని ఫైర్ అయ్యారు. ఈమేరకు బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి నారా లోకేశ్ శుక్రవారం అసెంబ్లీలో ప్రసంగించారు. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తే చాలు కేసులు పడేవని, దీంతో ఆ నోటిఫికేషన్ ఎటూ తేలేది కాదని అన్నారు. ఈ క్రమంలో లోటుపాట్లను సరిచేసి, ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేకుండా త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి వివరించారు. జీవో నెం.117ను రద్దు చేసి ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ చెప్పారు.