నేటి భారత్ న్యూస్- లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ (ఎంఐ) బ్యాటర్ తిలక్ వర్మ రిటైర్డ్ హర్ట్ అయిన విషయం తెలిసిందే. కోచ్ జయవర్దనే ఈ విషయాన్ని ముందే సూర్యకుమార్ యాదవ్‌కు చెప్పగా అతడు షాక్ అయ్యాడు. ఎందుకు అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత కోచ్ అతనికి సర్ది చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు తిలక్ వర్మ రిటైర్డ్ హర్ట్ అయిన తర్వాత క్రీజులోకి వెళ్లిన మిచెల్ శాంట్నర్ కేవలం రెండు బంతులే ఆడాడు. ఇంతదానికి ఎందుకు ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. మ్యాచ్ మధ్యలో ఇలా వెనక్కి రప్పించడంతో అతడి కాన్ఫిడెన్స్ దెబ్బతింటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది ముంబయి తరఫున రోహిత్ శర్మ తర్వాత అత్యధిక పరుగులు (416) చేసింది తిలక్ వర్మేనని గుర్తు చేస్తున్నారు. ఐపీఎల్ మాత్రమే కాదు టీమిండియా తరఫున టీ20ల్లో ఈ యంగ్ ప్లేయర్‌కి మంచి రికార్డు ఉంది. 25 మ్యాచుల్లో 50 సగటుతో 749 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు కూడా ఉన్నాయి. దక్షిణాఫ్రికా పర్యటనలో వరుసగా ఈ రెండు సెంచరీలు నమోదు చేశాడు. అలాంటి ఆటగాడిని ముంబయి యాజమాన్యం మ్యాచ్ మధ్యలో ఇలా వెనక్కి రప్పించి అమానించిందని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇక నిన్నటి మ్యాచ్‌లో ఎంఐపై లక్నో 12 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. లక్నో నిర్దేశించిన 203 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 28 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీసి ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన జట్టును పరాజయం నుంచి కాపాడాలేకపోయాడు.