నేటి భారత్ న్యూస్-తెలంగాణలో రోప్ వే పర్యాటకం త్వరలోనే అందుబాటులోకి రానుంది. స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద భువనగిరి కోటను రూ. 56.81 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు పర్యాటక సంస్థ తాజాగా టెండర్లు పిలిచింది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి నుంచి కోట వరకు కిలోమీటరు దూరం రోప్ వే ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ఇదే తొలి రోప్ వే కానుంది. ఏకశిల రాతిగుట్టపై నిర్మించిన భువనగిరి కోటకు శతాబ్దాల చరిత్ర ఉంది. ట్రెక్కింగ్ ప్రాధాన్యమున్న ప్రాంతాల్లో ఒకటైన ఈ కోటపైకి చేరడానికి దాదాపు గంట సమయం పడుతుంది. ఇప్పుడు రోప్ వే ఏర్పాటైతే మెట్లు ఎక్కే సమస్య తప్పడంతోపాటు రోప్ వే సరికొత్త అనుభూతిని పంచుతుంది. అలాగే కోటపైకి రోప్ వే ఏర్పాటుతోపాటు కోటపై ఉన్న నీటి కొలను, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ, ప్రవేశ ద్వారం, రోడ్లు, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తారు. భువనగిరి కోటతోపాటు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి, నల్గొండలోని హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ఆనకట్ట, మంథనిలోని రామగిరి కోట వరకు కూడా రోప్ వే ఏర్పాటు చేస్తారు. నాగార్జునసాగర్ ఆనకట్ట మీదుగా 5 కిలోమీటర్ల మేర రోప్ వే నిర్మించనుండగా మిగతావన్నీ 2 కిలోమీటర్ల మేర ఉన్నాయి. భువనగిరి కోట ప్రాజెక్టులో భాగంగా రోప్ వే కోసం రూ. 15.20 కోట్లు ఖర్చు చేయనుండగా 30 మీటర్ల వెడల్పుతో యాక్సెస్ రోడ్డు, పార్కింగ్ వంటి నిర్మాణాల కోసం రూ. 10.73 కోట్లు, ప్రవేశద్వారం, టూరిజం సదుపాయాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణకు రూ. 10.37 కోట్లు, ఇతర ఏర్పాట్లకు రూ. 11.11 కోట్లు ఖర్చు చేస్తారు.