

నేటి భారత్ న్యూస్- టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో ‘ఎస్ఎస్ఎంబీ 29’ ప్రాజెక్టు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ ఒడిశాలో షూటింగ్ జరుపుకుంది. ఈ సందర్భంగా జక్కన్న ఒడిశాలోని ప్రఖ్యాత దేవ్‌మాలి శిఖరంపై ట్రెక్కింగ్‌కు వెళ్లారు. ట్రెక్కింగ్ అనుభవాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉందని, కానీ ఒక విషయం తనను తీవ్రంగా బాధించిందని రాజమౌళి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పోస్టు పెట్టారు. “ఒడిశాలోని అత్యంత ఎత్తైన, అద్భుతమైన శిఖరం దేవ్‌మాలిపై సోలో ట్రెక్కింగ్ చేశాను. శిఖరంపై నుంచి వ్యూ అత్యద్భుతం. ఆ దృశ్యాలు చాలా ఉత్కంఠభరితంగా, ఇట్టే కట్టి పడేస్తాయి. అయితే, ఇంత సుందరమైన ప్రదేశంలో అపరిశుభ్ర పరిస్థితులు నన్ను తీవ్రంగా బాధించాయి. ట్రెక్కింగ్‌కు వచ్చిన సందర్శకులు వారు వాడిన వస్తువులను అక్కడే పడేయకుండా తమతో పాటు తిరిగి తీసుకెళ్లాలి” అని జక్కన్న ట్వీట్ చేశారు.