నేటి భారత్ న్యూస్-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇసుక మాఫీయాపై వస్తున్న వార్తల పట్ల ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్‌పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పొలాలను ఎండబెట్టి ఇసుక వ్యాపారం చేస్తుందని దుయ్యబట్టారు. అన్నం పెట్టే అన్నదాతకు సున్నంపెట్టి... అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలను నిలువునా మోసగించిందని కేటీఆర్ మండిపడ్డారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు... నీళ్లన్నీ తరలించుకు పోయిన తర్వాత అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తీరిగ్గా టెలీమెట్రీల గురించి మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నా ఒడిసిపట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని ఫైర్ అయ్యారు. నాలుగున్నర దశాబ్దాల కాంగ్రెస్ పాలన పాపం ఫలితమే తెలంగాణకు కృష్ణా, గోదావరి నదీజలాల్లో నీటి వాటా తేలకపోవడానికి కారణమని సంచలన ఆరోపణ చేశారు. పదేళ్ల పాలనలో కేసీఆర్... కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను వడివడిగా పూర్తి చేసి వందల టీఎంసీలు ఒడిసిపట్టేందుకు రిజర్వాయర్లు నిర్మించారని కొనియాడారు. కుంగిన కాళేశ్వరం పిల్లర్లను చూపి మరమ్మతులు చేపట్టకుండా నీళ్లను కిందకు వదిలి ఇసుకను దోచుకుంటున్నారని మండిపడ్డారు.