

నేటి భారత్ న్యూస్- నాగార్జున సాగర్ ప్రధాన డ్యామ్ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. నల్గొండ జిల్లాలోని సాగర్ ప్రధాన డ్యామ్‌ను ఆనుకొని ఉన్న ఎర్త్ డ్యామ్ దిగువ భాగంలో ఎండు గడ్డికి మంటలు అంటుకున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా ఉండటంతో డ్యామ్ పరిసరాల్లోని గడ్డి ఎండిపోయింది. దీని కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, డ్యామ్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. దాదాపు అర కిలోమీటరు మేర మంటలు వ్యాపించి గడ్డి కాలిపోయింది. మంటలు వ్యాపించిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే ప్రధాన విద్యుత్ కేంద్రం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంటలు అక్కడకి వ్యాపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.