

నేటి భారత్ న్యూస్- తమ డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణలోని ఆశా వర్కర్లు ఈరోజు ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఆశా వర్కర్లకు రూ.18 వేలు వేతనం ఇవ్వాలని, రూ.50 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని, మృతి చెందిన ఆశా వర్కర్ల కుటుంబాలకు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.50 వేలు ఇవ్వాలని, పదోన్నతులు, ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ తదితర డిమాండ్లను పరిష్కరించాలని ఆశా వర్కర్లు కోరుతున్నారు. ఈ డిమాండ్లపై కోఠిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టాలని వారు నిర్ణయించారు. ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ‘చలో హైదరాబాద్’ పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆశా వర్కర్లు హైదరాబాద్కు తరలి రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఆదివారం వేకువజాము నుంచే ఆశా వర్కర్లు బయటకు రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లో ఆశా వర్కర్ల ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.