

నేటి భారత్ న్యూస్- ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ఈ రోజు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు విజయవాడ (గన్నవరం) నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు సీఎం, డిప్యూటీ సీఎంలు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఈ రాత్రికి ఇద్దరూ ఢిల్లీలో బస చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు (బుధవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలవనున్నారు. రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. ఈ క్రమంలో రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిధులతో పాటు పలు అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించనున్నారు. బుధవారం రాత్రికి ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం, డిప్యూటీ సీఎం అమరావతికి చేరుకుంటారు.