

నేటి భారత్ న్యూస్- నేపాల్‌లో వివాహ వయసును 20 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. వివాహ వయసు 20 ఏళ్లుగా ఉండటం వల్ల అత్యాచారాలు పెరగడానికి కారణం అవుతోందని భావిస్తున్న ప్రభుత్వం దానిని తగ్గించేలా బాలల చట్టం, క్రిమినల్ కోడ్‌లను సవరించాలని నిర్ణయించింది. ప్రస్తుత వివాహ వయసు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండు మోడళ్లపై పనిచేస్తోందని మంత్రి అజయ్ చౌరాసియా తెలిపారు. ఇందులో మొదటిది వివాహ వయసును తగ్గించడం కాగా, రెండోది రోమియో జూలియట్ చట్టం. రోమియో జూలియట్ చట్టం అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఈ చట్టం ప్రకారం.. వివాహం కాకున్నా, నిర్దేశిత వయసు కన్నా ముందుగా ఇద్దరు యువతీయువకులు శృంగారంలో పాల్గొన్నా దానిని అత్యాచారంగా పరిగణించరు. అయితే, వారి మధ్య మూడేళ్ల వ్యత్యాసం మాత్రమే ఉండాలి.నేపాల్‌లోని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 2017 ప్రకారం.. 18 ఏళ్లలోపు యువతితో లైంగిక సంబంధం నెరిపితే దానిని లైంగికదాడిగా పరిగణిస్తారు. ఈ క్రమంలో ఆ యువతి అంగీకారమున్నప్పటికీ చట్టం మాత్రం అంగీకరించదు. దీంతో వేలమంది యువకులు 18 ఏళ్లలోపు అమ్మాయిలను ప్రేమ వివాహాలు చేసుకున్నా, వారి అంగీకారంతో పెళ్లి చేసుకున్నా ప్రభుత్వం నేరంగా పరిగణించడంతో బాల్య వివాహ నేరంతోపాటు అత్యాచార కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో వివాహ వయసును 18 ఏళ్లకు తగ్గించాలని నిర్ణయించింది.