

నేటి భారత్ న్యూస్- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆ మనిషి కార్పొరేటర్ కు ఎక్కువ… ఎమ్మెల్యేలకు తక్కువ… జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు అంటూ పవన్ పై జగన్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై లోకేశ్ మాట్లాడుతూ… డిప్యూటీ సీఎంపై జగన్ వి దిగజారుడు మాటలని విమర్శించారు. అహంకారానికి ప్యాంటు, షర్టు వేస్తే జగన్ లాగే ఉంటుందని అన్నారు. అసలు పవన్ కు వచ్చిన మెజారిటీ ఎంత, జగన్ కు వచ్చిన మెజారిటీ ఎంత? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నా, అధికారం కోల్పోయినా జగన్ ప్రజలకు దూరంగానే ఉన్నారని లోకేశ్ విమర్శించారు. పరదాల ప్రభుత్వం పోయాక రాష్ట్రంలో పరదాల అమ్మకాలు తగ్గాయట అని మంత్రి నారా లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇక, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అన్నది ప్రజలే నిర్ణయించారు… ఈ విషయం జగన్ కు ఎందుకు అర్థం కావట్లేదు? అని లోకేశ్ ప్రశ్నించారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా గురించి జగన్ సీఎంను కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తనను తల్లి, చెల్లి కూడా నమ్మట్లేదని జగన్ ఇంకా గ్రహించడంలేదు అని వ్యాఖ్యానించారు. 11 సీట్లు ఎందుకు వచ్చాయో జగన్ ఓసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదని అన్నారు.