

నేటి భారత్ న్యూస్- ఆరు నెలల క్రితం పారిశ్రామిక వేత్తలు తమను కలిసినప్పుడు 1947లో స్వాతంత్య్రo చూశామో లేదో కానీ, ఈ ప్రభుత్వం వచ్చాకే నిజమైన స్వాతంత్య్రo చూశామని చెప్పారని ఏపీ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ అన్నారు. అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే మాట్లాడడానికి కానీ లేదా ఏదైనా విషయం అడగడానికి కానీ వీలు కలిగిందని పారిశ్రామికవేత్తలు చెప్పారని మంత్రి తెలిపారు. పారిస్‌లో చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఇండియాలో ఎక్కడైనా పరిశ్రమలు పెట్టండి కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిశ్రమలు పెట్టకండని మాట్లాడే దుస్థితికి గత పాలకులు తెచ్చారన్నారు. గత ఎనిమిది నెలల్లో పారిశ్రామిక వర్గాల్లో తమ ప్రభుత్వం ఒక విశ్వాసాన్ని కలిగించిందన్నారు. సుమారు 6.50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారన్నారు. లక్షల ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడతాయన్నారు. చాలా మంది సభ్యులు పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించాలని, పరిశ్రమలు తెప్పించాలని కోరుతున్నారన్నారు. సభ్యులు విజయ్ కుమార్ రాజు, యార్లగడ్డ వెంకట్రావు, కృష్ణ చైతన్య, ఈశ్వరరావు చెప్పిన అంశాలను తాను, తమ ప్రిన్సిపల్ సెక్రెటరీ నోట్ చేసుకున్నామని.. దాన్ని పారిశ్రామికవేత్తలతోనూ, తమ సమీక్షలలోను కచ్చితంగా చర్చించి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటామని మంత్రి టి.జి భరత్ హామీ ఇచ్చారు.