నేటి భారత్ న్యూస్-క్రికెటర్లు విదేశీ పర్యటనలో వారి వెంట కుటుంబ సభ్యులను తీసుకెళ్లకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని విరాట్ కోహ్లీ తీవ్రంగా తప్పుబట్టారు. మ్యాచ్ ఆడే సమయంలో క్రీడాకారులు చాలా ఒత్తిడితో ఉంటారని, ఆ సమయంలో వారికి మద్దతుగా కుటుంబ సభ్యులు ఉండటంలో తప్పులేదని కోహ్లీ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు తోడుగా ఉంటే ఒత్తిడిని అధిగమించి చురుగ్గా ఆడతారని అన్నారు. ఒత్తిడిలో ఉన్న క్రీడాకారులు స్థిరత్వంలో ఉండటం కోసం కుటుంబ సభ్యుల తోడు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కోహ్లీ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. క్రికెట్ అభిమానులు, క్రికెటర్లు కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు. కోహ్లీ వ్యాఖ్యలకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. కోహ్లీ వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.