

నేటి భారత్ న్యూస్- సంచలనం సృష్టించిన మీరట్ హత్య కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. కన్నబిడ్డ పుట్టిన రోజు కోసం లండన్ నుంచి వచ్చిన భర్త సౌరభ్‌ను ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి దారుణంగా హతమార్చిన ముస్కాన్ రస్తోగి 11 రోజుల తర్వాత హోలీ వేడుకల్లో ప్రియుడితో కలిసి రంగులు పూసుకుని డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సౌరభ్‌ను హత్య చేసిన తర్వాత ముస్కాన్, సాహిల్ ఇద్దరూ కలిసి హిమాచల్ ప్రదేశ్ వెళ్లి మార్చి 17న తిరిగి వచ్చారు. హిమాచల్ ప్రదేశ్‌లో సాహిల్‌కు కేక్ తినిపిస్తూ ‘హ్యాపీ బర్త్ డే’ అని చెప్పి ముద్దు పెడుతున్న మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇంకో వీడియోలో ముస్కాన్ మంచులో నడుస్తూ ఎంజాయ్ చేస్తుండటం కనిపించింది. మార్చి 4న భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను హతమార్చినట్టు నిందితులు రస్తోగి, సాహిల్ ఇద్దరూ విచారణలో అంగీకరించారు. భర్తను హత్య చేసిన అనంతరం శరీరాన్ని ముక్కలుగా కోసి ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి కాంక్రీట్ పోసి సీల్ చేశారు. నిందితులు ఇద్దరినీ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీకి పంపింది.