

నేటి భారత్ న్యూస్- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ సంస్థ భారత్‌లో కాలుమోపుతోంది. తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించే క్రమంలో భాగంగా మొదటి ట్రంప్ బ్రాండెడ్ వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు భారత్‌లోని పూణెలో అడుగు పెట్టింది. గత కొన్ని దశాబ్దాలలో భారతదేశంలో తన మార్కెట్‌కి ప్రాధాన్యతను పెంచుకోవడానికి ట్రంప్ ఆర్గనైజేషన్ ప్రయత్నిస్తోంది. ట్రంప్ బ్రాండ్‌కి భారతదేశం అతిపెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా నిలిచింది. ఈ క్రమంలో భారత్‌లోని ట్రిబెకా డెవలపర్స్‌ను భాగస్వామిగా చేసుకుంది. ట్రిబెకా డెవలపర్స్ గతంలో దేశంలోని నాలుగు నగరాల్లో నివాస ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది. ఇప్పుడు 289 మిలియన్ డాలర్లకు పైగా అమ్మకాల లక్ష్యంతో కుందన్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ కంపెనీతో సహకారంతో పూణెలో ట్రంప్ వరల్డ్ సెంటర్ ప్రాజెక్టును ట్రిబెకా ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు నాలుగేళ్లలో పూర్తవుతుందని ట్రిబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా తెలిపారు.