

నేటి భారత్ న్యూస్ – చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజయం సాధించిన తర్వాత మధ్యప్రదేశ్, ఎంహౌలోని జామా మసీదు సమీపంలో అల్లర్లు చెలరేగాయి. టీమిండియా విజయం అనంతరం అభిమానులు మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జామా మసీదు ప్రాంతం నుంచి సాగుతుండగా సమీపంలోని గుంపు ర్యాలీపై రాళ్లు విసిరింది. ఇది రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది. ఈ సందర్భంగా పలు వాహనాలను ధ్వంసం చేశారు. రెండు దుకాణాలు, రెండు వాహనాలకు దుండగులు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్మీ సిబ్బంది కూడా అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గొడవ జరిగిన ప్రాంతం కంటోన్మెంట్ ఏరియా కావడంతో ప్రత్యేకంగా ఆర్మీ సిబ్బందిని మోహరించాల్సిన అవసరం రాలేదు. కాగా, ఈ ఘర్షణల్లో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.