

నేటి భారత్ న్యూస్– భర్త మద్యంకు బానిసై నిత్యం వేధిస్తుండటంతో అతన్ని అంతమొందించాలని అతని భార్య ప్లాన్ చేసింది. హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించాలని అనుకున్నా మృతుడి తల్లి (అత్త) అనుమానం వ్యక్తం చేయడంతో విషయం బయటపడింది. ఫలితంగా ఆమె కటకటాల పాలైంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా కేంద్రం పాతబస్తీకి చెందిన మహ్మద్ ఖలీల్ హుస్సేన్ (44) కనగల్ మండల పరిధిలోని చర్లగౌరారంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో అటెండర్ గా పని చేస్తున్నాడు. 2007లో అతనికి అక్సర్ జహాతో వివాహం కాగా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మద్యంకు బానిసైన ఖలీల్ తనను నిత్యం వేధిస్తుండటంతో అతని అడ్డు తొలగించుకుంటే తనకు లేదా తన పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని భార్య భావించింది. ఈ క్రమంలో గత నెల 22న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఖలీల్ తలపై భార్య అక్సర్ జాహా బలమైన వస్తువుతో గాయపర్చింది. అనంతరం మూర్ఛ వచ్చి కిందపడటంతో గాయపడ్డాడంటూ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి నామమాత్రంగా చికిత్స చేయించి ఇంటికి తీసుకెళ్లింది. 24వ తేదీ రాత్రి పరిస్థితి విషమించడంతో ఖలీల్‌ను నల్లగొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యుడు అప్పటికే అతను మృతి చెందినట్లు చెప్పారు. ఈ ఘటనపై అనుమానం ఉందని ఫిబ్రవరి 25న అక్బర్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 7న పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తలకు బలమైన గాయం అయినట్లు గుర్తించిన పోలీసులు .. మృతుడి భార్య అక్సర్ జహాను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం అంగీకరించింది. మంగళవారం పోలీసులు మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.