

నేటి భారత్ న్యూస్- ఎనిమిది రోజుల పర్యటన కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 9 నెలలుగా చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమిని చేరనున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు వారు భూమ్మీద ల్యాండ్ అవుతారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. సునీత, విల్మోర్ను తీసుకొచ్చేందుకు రెండ్రోజుల క్రితం ప్రయోగించిన స్పేస్ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ నిన్న (ఆదివారం) విజయవంతంగా అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. ‘క్రూ-10 మిషన్’లోని నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా ఐఎస్ఎస్లోకి ప్రవేశించారు దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. అమెరికా కాలమానం ప్రకారం నేటి (సోమవారం) రాత్రి 10.45 గంటలకు క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 12.45 గంటలకు అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమనౌక క్రూ డ్రాగన్ అన్‌డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం రేపు (మంగళవారం) సాయంత్రం 4.45 గంటలకు వ్యోమనౌక భూమికి తిరిగి పయనమవుతుంది. సాయంత్రం 5.11 గంటలకు భూ కక్ష్యను దాటుకుని కిందికి వచ్చి 5.57 గంటలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో ల్యాండ్ అవుతుంది. అనంతరం అందులోని వ్యోమగాములను ఒక్కొక్కరిని బయటకు తీసుకొస్తారు.