

నేటి భారత్ న్యూస్- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు మద్ధతుగా టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రచారం కోసం మస్క్ పెద్ద మొత్తంలో విరాళం కూడా ఇచ్చారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ట్రంప్ ప్రభుత్వ వ్యవహారాలలో మస్క్ కు ప్రాముఖ్యతనిస్తూ, ఆయన సలహాలు తీసుకోవడంపై అమెరికాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్ ను అవమానించేలా ఓ వీడియో రూపొందించిన దుండగులు అమెరికా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ బిల్డింగ్ (హెచ్ యూడీ) లోని టీవీలలో ప్రదర్శించారు.మస్క్ పాదాలను ట్రంప్ ముద్దాడుతున్నట్లు ఏఐ సాయంతో ఓ వీడియోను రూపొందించిన దుండగులు.. హెచ్ యూడీ సర్వర్ ను హ్యాక్ చేసి టీవీలలో దీనిని ప్రసారం చేశారు. అధికారులు గమనించి ప్రసారం ఆపేలోగా పలువురు సిటిజన్లు దీనిని తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారాయి. ఇటీవల ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ సోషల్ లో ‘లాంగ్ లివ్ ది కింగ్’ అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ క్యాప్షన్ ను దుండగులు తాజా వీడియో పైన ప్రదర్శించారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇది హ్యాకర్ల పనా లేక ఉద్యోగులలోనే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ వీడియోపై హెచ్ యూడీ అధికార ప్రతినిధి కాసె లావెట్ స్పందిస్తూ.. ఇది ప్రభుత్వ వనరులను, టాక్స్ పేయర్ల డబ్బును వృథా చేసే మరో ప్రయత్నమేనన్నారు. వీడియో ప్రసారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.