

నేటి భారత్ న్యూస్- ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేశ్ బాఘెల్ నివాసంలో బుధవారం సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. రాయ్ పూర్, భిలాయ్ లలోని బాఘెల్ నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. బుధవారం ఉదయం సీబీఐ అధికారులు బాఘెల్ ఇంటికి చేరుకున్నారని, ఆయన నివాసాలతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతల ఇళ్లపైనా రెయిడ్ చేశారని బాఘెల్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సోదాలకు సంబంధించి అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే, మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ విచారణలో భాగంగానే ఈ దాడులు జరిగినట్లు సమాచారం. బాఘెల్ ఈ రోజు ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా సీబీఐ సోదాలు జరగడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారని బాఘెల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, సీబీఐ దాడులపై కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్ గఢ్ నేత సుశీల్ ఆనంద్ శుక్లా స్పందిస్తూ.. భూపేశ్ బాఘెల్ ను చూసి బీజేపీ భయపడుతోందని అన్నారు. కాంగ్రెస్ పంజాబ్ ఇన్ ఛార్జిగా బాఘెల్ నియామకం జరిగిన తర్వాత బీజేపీ పెద్దలకు భయం మొదలైందన్నారు. బాఘెల్ ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక విచారణ సంస్థలతో దాడులు చేయిస్తూ నిలువరించే ప్రయత్నం చేస్తోందన్నారు. తొలుత ఈడీ అధికారులను పంపిన కేంద్రం.. తాజాగా సీబీఐ అధికారులను బాఘెల్ నివాసానికి పంపిందన్నారు. అయితే, ఈ దాడులకు బాఘెల్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ భయపడబోదని శుక్లా స్పష్టం చేశారు.