నేటి భారత్ న్యూస్- ఐసీసీ టోర్నీలంటే చాలు, ఆటతీరును మరో లెవల్ కు తీసుకెళ్లే టీమిండియా... తాజాగా పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 లో విన్నర్ గా నిలిచింది. ఒక్కసారి కూడా టాస్ గెలవకపోయినా, టోర్నీలో అన్ని మ్యాచ్ లు గెలిచి కప్ ను చేజిక్కించుకుంది. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టోర్నీలో తమ విజయంలో ఒక 'సైలెంట్ హీరో' ఉన్నాడని వెల్లడించాడు. శ్రేయస్ అయ్యర్ ను తను 'సైలెంట్ హీరో'గా అభివర్ణించాడు. మిడిలార్డర్ లో శ్రేయస్ అయ్యర్ రాణించడంతో సులువుగా విజయాలు నమోదు చేయగలిగామని వివరించారు. "ఈ టీమ్ పట్ల నేనెంతో గర్విస్తున్నాను. ఒక్కోసారి పరిస్థితులు అనుకూలించకపోవచ్చని మాకు తెలుసు... అందుకు అనుగుణంగా మమ్మల్ని మేం తీర్చిదిద్దుకున్నాం. ఈ టోర్నీలో మేం ఆడిన అన్ని మ్యాచ్ లు చూస్తే... పిచ్ లు మందకొడిగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్ ఆడిన తీరు అద్భుతం. టోర్నమెంట్ మొత్తం అతడు కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇతరులతో కలిసి అతడు నమోదు చేసిన భాగస్వామ్యాలు ఎంతో విలువైనవి. అందుకే శ్రేయస్ అయ్యర్ మా సైలెంట్ హీరో" అని రోహిత్ శర్మ వివరించాడు. శ్రేయస్ అయ్యర్ ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలో పాకిస్థాన్ పై 56, న్యూజిలాండ్ పై 79 పరుగులతో రాణించాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 45 పరుగులు చేసిన ఈ ముంబయి వాలా... ఫైనల్లో 48 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.