

నేటి భారత్ న్యూస్- ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. వరుసగా 13వ సారి ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. గత రాత్రి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన చెన్నై జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి వరుస ఓటముల రికార్డును తుడిచిపెట్టేయాలని ముంబై భావించింది. అయితే, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తేలిపోయిన ముంబైకి మరో ఓటమి తప్పలేదు. దీనికి తోడు చెన్నై బౌలర్లు ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ ఇద్దరూ పోటాపోటీగా వికెట్లు తీసి ముంబైని బెంబేలెత్తించారు. ఫలితంగా 155 పరుగుల ఓ మాదిరి స్కోరుకి పరిమితమైంది. రచిన్ రవీంద్ర (65), రుతురాజ్ గైక్వాడ్(53) అద్భుత బ్యాటింగ్‌తో చెన్నై తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.