నేటి భారత్ న్యూస్- మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన విజిలెన్స్ నివేదిక అందినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్డీఎస్ఏ తుది నివేదిక అందిన వెంటనే మరమ్మతులపై దృష్టి సారిస్తామని ఆయన స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు లేవనెత్తిన అంశాలపై మంత్రి వివరణ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. డీపీఆర్‌లో షీట్ పైల్స్ పేర్కొన్నప్పటికీ, నిర్మాణంలో సీకెంట్ ఫైల్స్ ఉపయోగించారని తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రపంచ స్థాయి నిపుణులను భాగస్వాములను చేసి సహాయక చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన మూడు గంటల్లోనే తాను స్వయంగా అక్కడకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించానని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెండు రోజుల క్రితం పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారని తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం తాత్కాలిక అవరోధమని, దీనిని పూర్తి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన స్పష్టం చేశారు. తమ్మిడిహట్టి ఆనకట్ట నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక, సాంకేతిక పరిశీలన ప్రస్తుతం కొనసాగుతోందని తెలిపారు. వీలైనంత త్వరగా పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తక్కువ ఖర్చుతో, త్వరితగతిన ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.