

నేటి భారత్ న్యూస్- మనం ఏదైనా పని చేస్తే తరతరాలుగా గుర్తుంచుకోవాలని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తే ఆయన మంత్రివర్గంలోని మంత్రులే మరిచిపోతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. పార్టీ నుండి తనను బహిష్కరించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, షోకాజ్ నోటీసులకు, సస్పెన్షన్లకు భయపడేది లేదని అన్నారు. వారి పిల్ల గాండ్రింపులకు భయపడేవ్యక్తిని కాదని అన్నారు.తనను కాంగ్రెస్ నుండి బహిష్కరించినప్పటికీ బీసీ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. కులగణన దేశానికి ఆదర్శంగా ఉండాలని ఆయన అన్నారు. కులగణన ద్వారా రాహుల్ గాంధీ తలెత్తుకొని తిరగాలని తాను ఆశించానని, కానీ అలా జరగలేదని విమర్శించారు. నూటికి నూరు శాతం పారదర్శకంగా చేస్తేనే ఆదర్శంగా ఉంటుందని పేర్కొన్నారు. కులగణన ద్వారా అగ్రవర్ణాలను ఎక్కువగా చూపించి, బీసీ వర్గాలను అణిచిపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.