

నేటి భారత్ న్యూస్- కంచ గచ్చిబౌలిలోని చిట్టడవిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత నిర్దయగా ధ్వంసం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. దీనివల్ల విలువైన వృక్ష, జంతుజాలం నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌సీయూ అడవులను ధ్వంసం చేయడంతో ఓ జింక ప్రాణాలు కోల్పోయిందని, ఆ రక్తపు మరకలు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేతికి అంటాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్యప్రాణుల ఈ దారుణ హత్యపై సుప్రీంకోర్టు దృష్టి సారించాలని తాను కోరుతున్నానని ఆయన అన్నారు. కంచ గచ్చిబౌలిలో 100 ఎకరాల్లో చెట్లను నరికివేయడంతో హెచ్‌సీయూ సౌత్ క్యాంపస్ హాస్టల్ వైపు ఒక జింక వచ్చిందని తెలిపారు. జింకను చూడగానే కుక్కలు మొరుగుతూ దానిపై విచక్షణారహితంగా దాడి చేశాయని ఆయన పేర్కొన్నారు. ఈ దాడిలో జింక తీవ్రంగా గాయపడటంతో హెచ్‌సీయూ విద్యార్థులు, సిబ్బంది వెటర్నరీ ఆసుపత్రికి తరలించారని, కానీ అది మృతి చెందిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం చాలా జింకలు జనావాసాల్లోకి వస్తున్నాయని, వాటిని పట్టణవాసులు ఆదరించి నీళ్లు అందిస్తున్నారని ఆయన చెప్పారు. మూడు రోజుల్లో 100 ఎకరాల్లో పచ్చని చెట్లను నరికివేయడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. పర్యావరణానికి హాని కలిగించే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.