

నేటి భారత్ న్యూస్- లోక్ సభ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై చెన్నైలో ఈ నెల 22వ తేదీన డీఎంకే నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడులను ఆహ్వానించనున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించనున్నారు. ఇందుకోసం తమిళనాడు మంత్రులతో కూడిన బృందం బయలుదేరింది. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బిజు జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌ను తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా, ఎంపీ దయానిధి మారన్‌తో కూడిన బృందం కలిసింది. ఈ నెల 22న జరిగే సమావేశాలకు నవీన్ పట్నాయక్‌ను ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్ తరఫున లేఖను అందించింది. ఈ భేటీకి ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తమిళనాడు మంత్రుల బృందం నేరుగా కలిసి ఆహ్వానిస్తోంది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు లోక్ సభలో ప్రాతినిధ్యం తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక పార్టీల ప్రతినిధులతో చెన్నైలో సమావేశం జరగనుంది.