

నేటి భారత్ న్యూస్- సూరత్ నుంచి కోల్‌కతా వెళుతున్న విమానంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రయాణికుడు బీడీ తాగుతూ సిబ్బందికి పట్టుబడ్డాడు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… సూరత్ నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో టేకాఫ్ ఆలస్యమైంది. దాంతో ప్రయాణికులు ఫ్లైట్‌లోనే నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో విమానం వాష్‌రూమ్ నుంచి పొగ, వాసన రావడంతో సిబ్బంది గమనించి ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు సోదాలు నిర్వహించగా… బెంగాల్‌కు చెందిన అశోక్ బిశ్వాస్ అనే వ్యక్తి బ్యాగ్‌లో బీడీలు, అగ్గిపెట్టె దొరికాయి. అతడే వాష్‌రూమ్‌లో బీడీ తాగినట్లు నిర్ధారించుకున్న అధికారులు బిశ్వాస్‌ను విమానం నుంచి దింపేయడంతో పాటు పోలీసులకు అప్పగించారు. సెక్యూరిటీ అధికారుల కళ్లుగప్పి అతడు నిషేధిత వస్తువులను విమానంలోకి ఎలా తీసుకొచ్చాడనే విషయంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అతడిపై కేసు కూడా నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.