నేటి భారత్ న్యూస్- శంషాబాద్ విమానాశ్రయంలో కొందరు ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు మూడు గంటలపాటు తిండితిప్పలు లేకుండా పడిగాపులుకాయాల్సి వచ్చింది. సాంకేతిక లోపం కారణంగా ఫ్లైట్ మూడు గంటలు ఆలస్యమైనట్లు సమాచారం. దాంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పైస్ జెట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విమానంలో ఏదైనా సమస్య ఉంటే... ఆలస్యం అవుతుందని ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిందని అసహనం వ్యక్తం చేశారు. తీరా విమానాశ్రయానికి వచ్చేసిన తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా గంటల తరబడి కూర్చోబెట్టడం ఏంటని ప్రయాణికులు సిబ్బందిపై మండిపడ్డారు. అసలే ఈరోజుతో ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా ముగియనుంది. ఇలాంటి సమయంలో ఎయిర్‌లైన్స్ యాజమాన్యం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, జనవరి 13న ప్రారంభమై 45 రోజుల పాటు జరిగిన కుంభమేళా ఇవాళ్టితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు భారీగా భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు క్యూ కడుతున్నారు. ఇక ఇప్పటికే 60 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వెల్లడించింది.