నేటి భారత్ న్యూస్ - యుద్ధం పేరుతో రష్యా చేస్తున్న దాడులతో అపార ప్రాణ, ఆస్తి నష్టంతో ఉక్రెయిన్ అల్లల్లాడతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీకి తలంటారు. రష్యాతో యుద్ధానికి ఉక్రెయినే కారణం అని మండిపడ్డారు. యుద్ధం మొదలుకాకముందే రష్యాతో జెలెన్ స్కీ ఒప్పందం చేసుకోవాల్సిందని ఫ్లోరిడాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వ్యాఖ్యానించారు. సౌదీలో మొదలైన శాంతి చర్చల్లో తమకు భాగస్వామ్యం కల్పించకపోవడంపై జెలెన్ స్కీ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అయితే చర్చల్లో ఉక్రెయిన్ కు చోటు కల్పించకపోవడంపై వస్తున్న విమర్శలను ట్రంప్ కొట్టిపారేశారు. చర్చల నుంచి ఉక్రెయిన్ ను పక్కకు తప్పించలేదని... చర్చల్లో ఆ దేశం కూడా ఉంటుందని స్పష్టం చేశారు. జెలెన్ స్కీ నే యుద్ధం ముగించాల్సిందని... మూడేళ్లుగా ఉక్రెయిన్లో ఉంటున్న ఆయన ఏం చేశారని ట్రంప్ ప్రశ్నించారు. జెలెన్ స్కీ నేతృత్వంలో ఉక్రెయిన్ తీవ్ర విధ్వంసానికి గురందైని... ప్రస్తతుం ఆ దేశంలో జెలెన్ స్కీకి ప్రజల మద్దతే లేదన్నారు. ఉక్రెయిన్ లో ఎన్నికలు జరపాలని, కేవలం 4 శాతం ప్రజలే జెలెన్ స్కీకి మద్దతు పలుకుతున్నారని పేర్కొన్నారు. యుద్ధం ద్వారా జరుగుతున్న ప్రాణ నష్టాన్ని తాను నివారించగలనని... ఆస్తుల విధ్వంసాన్ని ఆపగలనని... ఉక్రెయిన్ పోగొట్టున్న భూమినంతా ఇప్పించగలనని ట్రంప్ పేర్కొన్నారు.