

నేటి భారత్ న్యూస్- రాష్ట్రంలో జట్కా మటన్ షాపుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం మల్హర్ సర్టిఫికేషన్‌ను ప్రవేశపెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను తీసుకొచ్చింది. అయితే, ఈ సర్టిఫికేషన్ కేవలం హిందువులు నడిపే మాంసం దుకాణాలకు మాత్రమేనని ఫిషరీస్ మంత్రి నితీశ్ రాణే తెలిపారు. జట్కా మాంసం సరఫరాదారుల కోసం ప్రత్యేకంగా ‘మల్హర్ సర్టిఫికేషన్ డాట్ కామ్’ అనే వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు రాణే ప్రకటించారు. దీనిని ప్రత్యేకంగా హిందువులు నిర్వహిస్తారని, మాంసంలో ఎక్కడా కల్తీ ఉండదని నొక్కి చెప్పారు. అంతేకాదు, మల్హర్ సర్టిఫికేషన్ లేని దుకాణాల్లో హిందువులు మాంసం కొనవద్దని సూచించారు. దేశంలో ప్రస్తుతం ఉన్న హలాల్ సర్టిఫికేషన్ లాంటిదే మల్హర్ సర్టిఫికేషన్. హలాల్‌లో షరియా, ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా మాంసాన్ని రెడీ చేస్తారు. ఒక జంతువును తినేందుకు ముందు దానిని ఒక నిర్దిష్ట పద్ధతిలో బలి ఇవ్వాలని ఇస్లాం చెబుతుంది. అయితే, హలాల్‌కు భిన్నంగా జట్కాలో ఒకే దెబ్బతో నొప్పి లేకుండా జంతువును బలి ఇస్తారు. మల్హర్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ప్రకారం జట్కా మటన్, చికెన్ వ్యాపారులకు మల్హర్ సర్టిఫికెట్‌ను ఇస్తారు. ఇందులో హిందూ సంప్రదాయం ప్రకారం మేక లేదా, గొర్రెను బలి ఇస్తారు. ఆ తర్వాత మాంసాన్ని సిద్ధం చేస్తారు. ఈ మాంసం ప్రత్యేకంగా హిందూ ఖాతిక్ కమ్యూనిటీ విక్రేతల వద్ద లభిస్తుంది. కాబట్టి మల్హర్ ధ్రువీకరించిన విక్రేతల నుంచి మాత్రమే మటన్ కొనుగోలు చేయాలని కోరుతున్నట్టు వెబ్‌సైట్ పేర్కొంది.