

నేటి భారత్ న్యూస్- యెమెన్ లోని హౌతీలపై అమెరికా విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. నౌకలపై దాడులు చేస్తామంటూ హౌతీలు ప్రకటించడంతో… హౌతీలపై దాడులు చేయాలంటూ మార్చి 15న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. ఆయన ఆదేశాలతో అమెరికా బలగాలు భీకర దాడులు చేశాయి. ఆ దాడుల్లో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా… అనేక మంది గాయపడ్డారు. తాజాగా దాడికి సంబంధించిన డ్రోన్ దృశ్యాలను ట్రంప్ విడుదల చేశారు. రౌండ్ గా నిలుచున్న సమూహంపై దాడి చేసినట్టు వీడియోలో కనిపిస్తోంది. నౌకలపై దాడి చేసేందుకు వాళ్లు సమావేశమయ్యారని ట్రంప్ చెప్పారు. వాళ్లు ఎప్పటికీ నౌకలపై దాడి చేయలేరని అన్నారు. అమెరికా వాణిజ్య, నేవీ నౌకలు స్వేచ్ఛగా వెళ్లకుండా ఏ ఉగ్రశక్తి ఆపలేదని చెప్పారు. హౌతీలకు మద్దతు ఇవ్వడాన్ని ఇరాన్ ఆపేయాలని హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్పందిస్తూ… హౌతీల దాడుల్లో తమ ప్రమేయం లేదని చెప్పారు. సొంత కారణాలతో హౌతీలు దాడులకు పాల్పడుతున్నారని… ఈ విషయంలో తమపై అనవసర ఆరోపణలు చేస్తే అమెరికా తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. మరోవైవు, అమెరికా దాడులను హౌతీ పొలిటికల్ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది.