

నేటి భారత్ – వెయ్యిమందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపేందుకు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ సిద్ధమవుతోంది. వీరిలో రెగ్యులర్ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్ సిబ్బంది కూడా ఉన్నారు. నష్టాలను తగ్గించుకోవడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఐదు నెలల వ్యవధిలో ఓలా రెండోసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కొనుగోళ్లు, కస్టమర్ రిలేషన్స్ సహా పలు విభాగాల్లో ఈ కోతలు ఉంటాయని సమాచారం.నవంబర్‌లో ఓలా 500 మంది ఉద్యోగులను తొలగించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి ఓలా నష్టాలు 50 శాతం పెరిగిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ సిబ్బందితో కలుపుకొని ఓలాలో మొత్తం 4 వేల మంది పనిచేస్తున్నారు. తాజా తొలగింపులు వీరిలో పావు వంతు భాగం కావడం గమనార్హం.ఫ్రంట్ ఎండ్ ఆపరేషన్లను ఆటోమేటెడ్ చేసి ఖర్చులను తగ్గించుకొని, వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించేందుకు కంపెనీని పునర్నిర్మిస్తామని ఓలా పేర్కొంది. ఆగస్టులో పబ్లిక్ ఇష్యూకు వెళ్లిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 60 శాతం నష్టపోయాయి. ఫిబ్రవరిలో ఓలా 25 వేల యూనిట్లు అమ్మింది. నిర్ధారిత లక్ష్యం 50 వేలలో ఇది సగం మాత్రమే కావడం గమనార్హం.