

నేటి భారత్ న్యూస్ – దొంగతనం ఎందుకు చేశావ్? అని మైనర్ అయిన కుమారుడిని ప్రశ్నించి.. కాస్త మందలించడమే ఆ తండ్రి చేసిన పాపమైంది! కోపం పెంచుకున్న ఆ కుమారుడు ఏకంగా కన్నతండ్రి ప్రాణాలు తీసేందుకు పథకం వేశాడు. ఇంట్లోని ఓ గదిలో నిద్రిస్తున్న తండ్రికి నిప్పు పెట్టాడు. మంటలకు తాళలేక బాధితుడు బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా .. అందుకు వీల్లేకుండా ఆ గదికి బయట నుంచి తలుపులు బిగించాడా కుమారుడు. దీంతో ఆ గదిలోనే ఆ తండ్రి సజీవదహనమయ్యాడు. ఈ హృదయ విదారకమైన ఘటన హర్యానాలోని ఫరీదాబాద్ లో జరిగింది. మృతుడు 55 ఏళ్ల ఆలం అన్సారీ. నిందితుడు 14 ఏళ్ల అతడి కుమారుడు. ఫరీదాబాద్‌లోని ఓ ఇంట్లో అన్సారీ, అతడి 14 ఏళ్ల కుమారుడు అద్దెకు ఉంటున్నారు. మంగళవారం తన షర్టు జేబులోంచి డబ్బులు తీయడంతో కుమారుడిని అన్సారీ తిట్టాడు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1:30 గంటలకు గదిలోంచి అరుపులు వినిపించడంతో స్థానికులు వెళ్లి చూసేసరికే అతడు ప్రాణాలు విడిచాడు. స్థానికులు చూస్తుండగానే ఆ కుమారుడు ఇంటి గోడ దూకి పారిపోయాడు. కొద్దిసేపటికే బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు.