

నేటి భారత్ న్యూస్-తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు గడిచినా, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. 15 నెలల్లో రూ.1,50,000,00,00,000 అప్పు అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రం ₹1.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సహాయం, వివాహం చేసుకునే మహిళలకు 10 గ్రాముల బంగారం, యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ₹4,000 పెన్షన్ వంటి కీలక వాగ్దానాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. “రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు, కానీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ చేతిలో దారుణంగా మోసపోయారు. 420 వాగ్దానాలు ఇచ్చారు… అమలు చేసింది సున్నా. ₹1.5 లక్షల కోట్లు మాయం ఆవిరయ్యాయి” అంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజలకు అందాల్సిన డబ్బు ఎక్కడికి పోయిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. “ఇంత భారీగా అప్పులు చేసి, ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం సిగ్గుచేటు” అని ఆమె విమర్శించారు.