

నేటి భారత్ న్యూస్ – మరికొన్ని గంటల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మెగా టోర్నీకి తెర లేవనుంది. ఈరోజు మధ్యాహ్నం పాక్-కివీస్ మధ్య జరిగే మొదటి మ్యాచ్ తో టోర్నీ ప్రారంభమవుతుంది. రేపు బంగ్లాదేశ్ తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక ఈసారి టోర్నీ హైబ్రిడ్ మోడ్ లో పాకిస్థాన్, దుబాయ్ లో జరగనున్న విషయం తెలిసిందే. టీమిండియా తన మ్యాచ్‌లన్నింటినీ దుబాయ్ వేదికగా ఆడనుంది. ఇదిలాఉంటే.. 1998లో ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ నాకౌట్ ట్రోర్నీగా ప్రారంభించింది. టెస్ట్ ఆడని దేశాల కోసం నిధులు సేకరించడం, అసోసియేట్ దేశాలలో క్రికెట్ క్రీడకు ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో టోర్నమెంట్ ప్రారంభమైంది. 2017 వరకు సజావుగా సాగిన ఈ టోర్నీని 2021లో రద్దు చేశారు. వన్డే వరల్డ్‌కప్ మాదిరిగానే నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ టోర్నమెంట్ ఎందుకనే అభిప్రాయం వ్యక్తమైంది. అదే సమయంలో వరుసగా 2022, 2024లలో టీ20 ప్రపంచకప్ లు జరిగాయి. దాంతో 8 ఏళ్ల పాటు టోర్నీ నిర్వహణ సాధ్యపడలేదు. ఇప్పుడు మళ్లీ 2025లో టోర్నీని పునరుద్ధరించి నిర్వహిస్తోంది ఐసీసీ.మొత్తం మీద మునుపటి ఎనిమిది ఎడిషన్లలో ఏడు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాయి. టోర్నీలో రెండుసార్లు ఛాంపియన్లుగా నిలిచి భారత్, ఆస్ట్రేలియా అత్యంత సక్సెస్‌ఫుల్ జట్లుగా ఉన్నాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు 1998 నుంచి 2017 వరకు గత విజేతలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం. 1998లో విజేత దక్షిణాఫ్రికా: టోర్నీ మొదటి ఎడిషన్ లో టెస్ట్ ఆడే 9 దేశాలు పోటీ పడ్డాయి. భారత జట్టు ఆస్ట్రేలియాను ఓడించి సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. కానీ, సెమీస్ లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు దక్షిణాఫ్రికా.. ఇంగ్లండ్, శ్రీలంకలపై వరుస విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ లో హాన్సీ క్రోనే అజేయ అర్ధ శతకం (61) చేయగా, జాక్వెస్ కాలిస్ ఐదు వికెట్లు పడగొట్టడంతో ప్రోటీస్ జట్టు విండీస్ ను ఫైనల్ లో నాలుగు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ ను కైవసం చేసుకుంది. 2000లో విజేత న్యూజిలాండ్: కెన్యాలో జరిగిన ఈ టోర్నమెంట్ రెండో ఎడిషన్ లో ఈసారి 11 జట్లు పాల్గొన్నాయి. ఈసారి టీమిండియా ఫైనల్ వరకు వెళ్లింది. సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ ఫైనల్ కు చేరుకుంది. అయితే, ఫైనల్ లో కివీస్ చేతిలో ఓడిపోయి రన్నరప్ తో సరిపెట్టుకుంది. 2002లో ఉమ్మడి విజేత భారత్, శ్రీలంక: మొదట ఇండియాలో జరగాల్సిన ఈ టోర్నమెంట్‌ను పన్ను మినహాయింపు సమస్య కారణంగా శ్రీలంకకు తరలించారు. టోర్నమెంట్ మూడవ ఎడిషన్‌లో 12 జట్లు పోటీ పడ్డాయి. ఇందులో 10 టెస్ట్ ఆడే దేశాలు, కెన్యా, నెదర్లాండ్స్ పాల్గొన్నాయి. మొదటి సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాను శ్రీలంక ఓడించగా, మరో సెమీస్ లో ప్రోటీస్ జట్టును భారత్ ఓడించింది. అయితే, వర్షం కారణంగా ఫైనల్ రద్దు కావడంతో భారత్, శ్రీలంకలను ఉమ్మడి విజేతలుగా ప్రకటించింది.2004లో విజేత వెస్టిండీస్: టోర్నమెంట్ నాలుగో ఎడిషన్ లో కరేబియన్ జట్టు టైటిల్ దక్కించుకుంది. ప్రముఖ ఓవల్ మైదానంలో జరిగిన ఫైనల్ లో ఇంగ్లండ్ ను ఓడించి వెస్టిండీస్ ఛాంపియన్ గా అవతరించింది.2006లో విజేత ఆస్ట్రేలియా: టోర్నీ ఐదో ఎడిషన్ లో మరోసారి మాజీ ఛాంపియన్ వెస్టిండీస్ అద్భుత ప్రదర్శన ఈసారి కూడా ఫైనల్ కు చేరుకుంది. కానీ, ఫైనల్ లో ఆసీస్ చేతిలో పరాజయం పాలైంది. డక్‌వర్త్ పద్ధతిలో ఎనిమిది వికెట్ల తేడాతో కరేబియన్ జట్టు ఓడిపోయింది. దాంతో ఆస్ట్రేలియా తమ తొలి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.2009లో విజేత ఆస్ట్రేలియా: ఈసారి కేవలం ఎనిమిది జట్లకు మాత్రమే అవకాశం ఇచ్చారు. వన్డే ర్యాంకింగ్స్ లో టాప్-10లో ఉన్న జట్ల నుంచి మొదటి 8 టీమ్స్ కు టోర్నీ ఆడే అర్హత కల్పించారు. ఈ టోర్నమెంట్‌ను మొదట పాకిస్థాన్ లో నిర్వహించాలని నిర్ణయించిన భద్రతా కారణాల దృష్ట్యా దక్షిణాఫ్రికాకు తరలించారు. ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఫైనల్ లో న్యూజిలాండ్ ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని నిలబెట్టుకుంది ఆస్ట్రేలియా. తద్వారా వరుసగా వరుసగా రెండోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టుగా ఆసీస్ నిలిచింది.2013లో విజేత భారత్: శిఖర్ ధావన్ (363 పరుగులు), ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (12 వికెట్లు) అద్భుతమైన ప్రదర్శనతో భారత్ రెండుసార్లు టైటిల్ గెలుచుకున్న రెండవ జట్టుగా నిలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని జట్టు ఫైనల్ లో ఆతిథ్య ఇంగ్లండ్ ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకుంది.2017లో విజేత పాకిస్తాన్: ఇక 2013 ఎడిషన్ చివరి ఛాంపియన్స్ ట్రోఫీ అవుతుందని అంతా భావించారు. ఎందుకంటే దాని స్థానంలో ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)ను ప్రతిపాదించింది. అయితే, డబ్ల్యూటీసీ భావన రద్దు చేయబడిన తర్వాత 2014లో దీనిని పునరుద్ధరించారు. టీమిండియా తరఫున మరోసారి శిఖర్ ధావన్ (338 పరుగులు) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దాంతో టీమిండియా మళ్లీ ఫైనల్ కు చేరుకుంది. కానీ, ఫైనల్ లో దాయాది పాకిస్థాన్ చేతిలో భారత్ ఘోర పరాజం ఎదురైంది. 180 పరుగుల తేడాతో టీమిండియా అవమానకరమైన ఓటమిని చవిచూసింది.