

నేటి భారత్ న్యూస్- ఈ నెల 8వ తేదీన ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సమన్వయంతో నిర్వహించి విజయవంతం చేయాలని మంత్రులు ఎస్.సవిత, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరు కాబోతున్న నేపథ్యంలో క్రమశిక్షణతో పకడ్బందీగా మహిళా దినోత్సవం నిర్వహించాలని స్పష్టం చేశారు. వెలగపూడిలో రాష్ట్ర సచివాలయంలో పది శాఖలకు చెందిన అధికారులతో మంత్రులు మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. స్త్రీ, శిశు, గిరిజన, బీసీ, చేనేత, హోం తదితర శాఖలకు చెందిన డైరెక్టర్లు, ఇతర అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లక్ష మందికి పైకి మహిళలకు టైలరింగ్‌లో శిక్షణను ఇచ్చి, కుట్టుమిషన్లు అందజేయాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి ఈవెంట్ మేనేజ్‌మెంట్ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని కూడా సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన స్టాళ్లు ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చేనేత వస్త్రాలు, హస్తకళలకు సంబంధించిన స్టాళ్లు కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారిని ఎంపిక చేయాలని, వారికి సీఎం చేతుల మీదుగా యూనిట్ల మంజూరుకు సంబంధించిన చెక్కులు, మంజూరు పత్రాలు పంపిణీ చేయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అన్ని శాఖలకు సంబంధించి 15 స్టాళ్లు మాత్రమే ఏర్పాటు చేయాలని మంత్రి అనిత స్పష్టం చేశారు. మహిళా రక్షణకు శక్తి యాప్ రూపొందించామని, ఈ యాప్ ను మహిళా దినోత్సవం రోజున సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమంతో సమాంతరంగా జిల్లాలలోనూ మహిళా దినోత్సవాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఈ విషయమై జిల్లా స్థాయి అధికారులకు తక్షణమే సమాచారం అందించాలని ఆదేశించారు.