

నేటి భారత్ న్యూస్ – మహబూబ్‌నగర్ బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను దూషించి ముఖ్యమంత్రి అయితే, రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను దూషించి ముఖ్యమంత్రి అయ్యారని ఆమె అన్నారు. దూషణలతో ముఖ్యమంత్రులైన వారిని ప్రజలు హర్షించరని ఆమె వ్యాఖ్యానించారు. నిన్న జనగామ జిల్లాలో డీకే అరుణ పర్యటించిన సందర్భంగా రేవంత్‌పై ఆమె ఈ విమర్శలు చేశారు.రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారని డీకే అరుణ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కులగణనలో పాల్గొనని వారిని రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని అనడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. అలా అనడానికి రేవంత్ రెడ్డి ఎవరు? ఆయనకు ఏం హక్కు ఉందని ఆమె నిలదీశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాష్ట్ర ప్రజలే రేవంత్ రెడ్డిని బహిష్కరిస్తారని ఆమె హెచ్చరించారు.కులగణన సర్వేలో వ్యక్తిగత వివరాలు, ఆస్తులతో పాటు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వారన్న వివరాలు ఎందుకు సేకరిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి భయంతో పాల్గొన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ చేసిన సర్వేను రేవంత్ రెడ్డి ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో అక్రమాలు, అవినీతి జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని డీకే అరుణ ప్రశ్నించారు.